ప్రజలకు మెరుగైన వైద్యం అందాలి
* లింగాల సీహెచ్‌సీ తనిఖీలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
* అప్పాయపల్లిలో ఫామ్‌పాండ్ పనుల పరిశీలన
అచ్చంపేట,(విజయక్రాంతి): మారుమూల గ్రామాల ప్రజలకు పట్టణ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలంలో పర్యటించిన ఆయన లింగాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్స, వైద్యులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, అత్యవసర వైద్య సేవలు, ల్యాబ్ పనితీరు, ఓపీ సేవలు, రికార్డులను పరిశీలించారు.
ప్రతి నెల జరిగే ప్రసవాలు, రోజువారీ ఓపీ, రక్త నమూనాల సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు సూచించారు. రోగులకు సత్వర వైద్యం అందించాలని, సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. గిరిజన, మారుమూల గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
* పనుల పరిశీలన
అనంతరం అప్పాయపల్లి గ్రామంలో రైతు మల్లయ్య పొలంలో వి.బి.జీ. రాంజీ పథకం కింద నిర్మిస్తున్న ఫామ్‌పాండ్ పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, అమలు తీరును సమీక్షించారు. ఫామ్‌పాండ్‌ల ద్వారా వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెరుగుదల, సాగునీటి అవసరాల తీర్చడంలో కీలక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు.
గ్రామంలో మూడు ఫామ్‌పాండ్‌లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించగా, నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, గ్రామ సర్పంచ్ విజయకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






