ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు
సత్తుపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నివాళులు
ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దాం
సత్తుపల్లి ఆగస్టు06( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, జీవితాంతం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్, వ్యక్తిగత పదవులు, ప్రయోజనాల కంటే తెలంగాణ సమాజ సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం, నిరాడంబర జీవనం, నిష్కళంక వ్యక్తిత్వం, ఉద్యమం పట్ల అచంచలమైన అంకితభావంతో తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా ఆయనను ప్రజలు స్మరించుకుంటున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ఎస్. కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రకాశరావు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఉండటం మనం చేసుకున్న అదృష్టమని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కేశవరెడ్డి,ప్రకాశరావు,కమిటీ సభ్యులు రామిశెట్టి సుబ్బారావు, డి. కృష్ణయ్య, సాంబశివరెడ్డి, బి. మధుసూదన రాజు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.






