ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
- మైనర్ బాలికతో కిచెన్ లో పనులు చేయిస్తుండడం పట్ల ఆగ్రహం
కళాశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసు జారీ
సదరు బాలికను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్ లను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. విద్యార్థినుల కోసం వండిన అన్నం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.
కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కాగా, కిచెన్ లో మైనర్ బాలిక (16) పనులు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ఆమె గురించి వాకబు చేశారు. తన పెద్దమ్మతో కలిసి గత కొన్ని రోజులుగా కిచెన్ లో వంట పనులలో సహాయం చేస్తున్నానని సదరు బాలిక కలెక్టర్ కు తెలిపారు. దీంతో కలెక్టర్ కళాశాల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సు కలిగిన మైనర్ బాలికతో ప్రభుత్వ విద్యా సంస్థలో ఎలా పనులు చేయిస్తున్నారని నిలదీశారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, కళాశాల ప్రిన్సిపాల్ సయ్యదా జైనబ్ కు షోకాజ్ మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తామని బాలికకు కలెక్టర్ భరోసా కల్పించారు. బాలికను సమీపంలోని పాఠశాలలో చేర్పించి, ఉచిత విద్యా, వసతి అమలయ్యేలా చూడాలని సీ.డీ.పీ.ఓ, ఎం.ఈ.ఓలను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిగ్రీ విద్యార్థినులకు కొద్దిసేపు వివిధ అంశాలపై బోధన చేశారు. చక్కగా చదువుకుని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదని మార్గనిర్దేశం చేశారు.




