యోగాతో సార్వత్రిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం...
యోగాతో ఖైదీలలో మానసిక పరివర్తన
జాతీయ పోటీలకు వేదికగా కరీంనగర్
ఛాంపియన్లుగా తిరిగి రావాలి..
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆగస్ట్24 (విజయక్రాంతి): అట్టహాసంగా జిల్లాస్థాయి యోగా పోటీలు మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి యోగాసనా పోటీల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం,యోగా చేయడం తప్పనిసరి అన్నారు. 30 ఏళ్ళ వయసు వచ్చేవరకు జీవితంలో ఏమి చేయలేదో, ఏమి చేయాలో యోగా చెబుతుందన్నారు. పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకుడదని, యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు. కారాగారంలో ఉండే ఖైదీలలో సైతం యోగాతో మానసిక పరివర్తన కలుగుతుందని చెప్పారు.
కేవలం క్రీడలనే సహ పాఠ్యాంశాలని ప్రధానంగా ఏర్పడిన కరీంనగర్ ప్రాంతీయ పాఠశాలలో 2006 నుండి ఇప్పటివరకు ఒక్క విద్యార్థి ఫెయిల్ కాలేదన్నారు. యోగ ఒక కరికులంగా భావించాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగ ఆసనాలు చూస్తే ఆనందం, గర్వంగా ఉందన్నారు. వీరిలో ఎముకలు , కండరాలు ఉన్నాయా , రబ్బర్ బాండ్ లా సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి పోటీలో సైతం మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. భవిష్యత్తులో జాతీయస్థాయి యోగా పోటీల వేదికగా కరీంనగర్ నిలవాలన్నారు. జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుండి కరీంనగర్ జిల్లా ఛాంపియన్ గా నిలిచిన గొప్ప చరిత్ర ఉందన్నారు. ఆస్ఫూర్తిని 20 ఏళ్లుగా క్రీడాకారులు కొనసాగించేలా విశేషంగా కృషి చేస్తున్న ఘనత అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డిది అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి ఎక్కువ మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైతే జాతీయ స్థాయి పోటీలను కరీంనగర్లో నిర్వహించుకుందామని తెలిపారు.
అనంతరం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. సిద్ధారెడ్డి, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.జనార్దన్ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి. రమేష్ రెడ్డి, డిఈఓ కార్యాలయం సూపర్డెంట్ ఎం నరసింహస్వామి జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వేణుగోపాల్, యోగా కోచ్ లు సంపత్ కుమార్ కిష్టయ్య రామకృష్ణ మల్లేశ్వరి అశోక్ కోటేశ్వరరావు ప్రవీణ స్వరూప చారి వ్యాయామ ఉపాధ్యాయులు ఆర్ నర్సయ్య పి శ్రీనివాస్ సత్యానంద్ సూర్య ప్రకాష్ స్నేహలత హరి ప్రసాద్ సహ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఇంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ పోటీలను ఇలా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.






