పాముకాటుతో విద్యార్థిని మృతి
24-08-2024 06:12 PM
మెదక్: పాముకాటుతో ఏడవ తరగతి విద్యార్థిని శనివారం మృతి చెందిన సంఘటన కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (బి) గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తొండ్రు వైష్ణవి (12) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు కుడికాలు ఎడమచేతి కి ఏదో కరిచిందని విద్యార్థిని తన తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు లేచి చూసేసరికి పాప పడుకున్న పక్కనే పాము ఉండడంతో పాము కరిచి ఉండవచ్చని మెదక్ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.






