20-01-2026 01:11:32 AM
మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడా లన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీర ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 1,049 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 4 కోట్ల 25 లక్షల 70 వేల 880 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును అదనపు కలెక్టర్ శ్యామల దేవి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య లతో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళ సంఘాలకు అందించిన ఈ నిధులు డీబీటీ పద్దతి ద్వారా నేరుగా సంఘాల బ్యాం కు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మహిళలు కట్టిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ తిరిగి చెల్లిస్తోందని పేర్కొన్నారు. ఈ డబ్బును కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరో గ్యం లేదా వ్యాపార విస్తరణకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పట్టణంలో సుమారు 11,000 మంది మహిళలకు (దాదాపు 30% కుటుంబాలకు) దీని ద్వారా లబ్ధి చేకూరుతోందని అన్నారు. మహిళలు ఇప్పటికే ఇందిరా మహి ళా శక్తి క్యాంటీన్లు, విజయ డెయిరీ పార్లర్లు, స్కూల్ యూనిఫామ్ కుట్టు పని, పెట్రోల్ బంకుల నిర్వహణలో రాణిస్తున్నారని, అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ రాజు, డి.ఎం.సి మెప్మా శ్రీనివాస్, టి.ఎం.సి మెప్మా భాగ్యలక్ష్మి, సిబ్బంది, ఆర్.పి.లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.