5 March, 2026 | 3:20 AM

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

05-03-2026 12:26 AM

ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిపై  సస్పెన్షన్ వేటు

మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, మార్చి 4 (విజయ క్రాంతి) : ఇందల్వాయి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో రామ్ చరణ్ (15) అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు.

ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ ను, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్ ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇంచార్జి ఆకాష్ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయి, రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు.

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు.