19-08-2025 07:32:58 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రైతులకు ఎరువులు, మందులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, ఈ-పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాకు నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అడిగిన మందులను నిర్ణీత ధరలకు మాత్రమే విక్రయించాలని, అదనంగా మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు చేసిన అంశాలకు సంబంధించి రైతులకు నగదు రసీదును రైతులకు అందించాలని తెలిపారు.
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కోరత సృష్టిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ, పంట మెలకువలు తెలుసుకుని, యూరియా, ఇతర మందులను మోతాదు ప్రకారం పిచికారి చేయాలని, అధిక దిగుబడి పొందాలని తెలిపారు. మందులను మోతాదుకు మించి వినియోగించకూడదని, మందులు కొనుగోలు చేసిన రసీదులను రైతులు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం యూరియా, విత్తనాలు, మందులను సాగుకు అనుకూలంగా పంపిణీ చేస్తుందని, రైతులు అవకాశాన్ని వినియోగించుకుని పంట సాగు చేయాలని తెలిపారు.