calender_icon.png 29 January, 2026 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

29-01-2026 03:48:59 PM

ఆర్మూర్, భీంగల్ లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

అర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పట్టణాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామపత్రాలు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆర్మూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో పలు లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రీపోలింగ్ కు అవకాశం కల్పిస్తే, సంబంధిత మున్సిపల్ కమిషనర్లను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. చివరి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నందున, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని హితవు పలికారు.

కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు, అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తు.చ తప్పక పాటించాలని అన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు, నిర్ణీత గడువు లోపు బీ.ఫారం సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ కమిషనర్లు ఉమా మహేశ్వర్, గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు.