12-09-2025 10:11:37 PM
పోలీస్ సిబ్బంది డ్యూటీ చేస్తున్న రైతులకు దొరకని బస్తాలు
సహకార సొసైటీ సిబ్బంది వికృత పోకడతో రైతులు గగ్గోలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): గడిచిన 10 రోజులుగా రైతులు తమ వరి పొలాల్లో యూరియా వేసుకోవడానికి ఒక ప్రక్క సొసైటీలు, మరొక ప్రక్క ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపుల్లో కొనుక్కోవడానికి బారులు తీరినప్పటికీ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో యూరియా నిలువలు లేకపోవడంతో రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సహకార సొసైటీ కేంద్రంలో ప్రతిరోజు రైతులు బారులు తీరి, గంటల తరబడి నిలబడి, వారి ఆధార్ పాస్ పుస్తకాలను పెట్టి, రెండు రోజులు గడిచిపోగా, పాపం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీ చేస్తూ, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కటిస్తున్న తరుణంలో శుక్రవారం ఓ పలుకుబడి గల వ్యక్తి నలుగురు పేర్ల మీద, సుమారు పది బస్తాలు తీసుకొని, ఆటోలో వేశారు.
ఇది గమనించిన స్థానిక రైతులు కోపోద్రిక్తులై పోలీసులపై తిరగబడి దూశిస్తూ, ఆటోలో ఉన్న యూరియా బస్తాలను బయటకి లాగేశారు. అందులో కొన్ని బస్తాలు కూడా రైతులు ఎత్తుకొని వెళ్ళినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనితో రైతులు కోపోద్రిక్తులై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, ఒక్కొక్క రైతుకు పాసుబుక్కు ఆధార్ కార్డు ఉంటే, ఒక్కటి మాత్రమే ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, సొసైటీ సిబ్బంది తుంగలో తొక్కి, యూరియా బస్తాలు పక్క దారిన పట్టిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రతి రైతుకు ఒక్కొక్క యూరియా బస్తా, చేరే విధంగా కృషి చేయాలని స్థానిక రైతులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు