12-09-2025 10:20:04 PM
అర్మూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం అర్మూర్ పట్టణానికి విచ్చేసిన ఆయన పట్టణంలోని సి కన్వెన్షన్ విలేకరులతో మాట్లాడారు. అర్మూర్ కు విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15 తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాతావరణంలో మార్పుల వల్ల వాయిదా వేస్తున్నామన్నారు. వాతావరణం అనుకూలతను బట్టి ఈనెల 16, 17 తేదీల్లో బిసి డెకరేషన్ సభ ఉండవచ్చని తెలిపారు. కావున ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గమనించాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు, ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర మంత్రి శ్రీహరి అన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. జర్నలిజాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని, అది లేకుంటే ప్రపంచమే లేదని పేర్కొన్నారు.