calender_icon.png 26 November, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పోచారంకు కాలనీవాసుల వినతి

26-11-2025 07:44:31 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని గంగపుత్ర సంఘ సభ్యులు బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాలనీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రోడ్లు, డ్రెనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షాకాలం  వస్తే కాలనీ మొత్తం మురికి నీటితో నిండిపోతుందన్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో కాలనీలోకి వాహనాలు రాలేని పరిస్థితి ఉందన్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారు ఇటుక, ఇసుక, ఇతర సామగ్రి తీసుకు రావడానికి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.