26-11-2025 07:35:09 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): 8వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ అవగాహన సదస్సును ప్రిన్సిపల్ రామచంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా డాక్టర్ కే వీరస్వామి రాజనీతి శాస్త్రం ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1946 డిసెంబర్ 9 నుండి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు మొదలై నవంబర్ 26 1949 వరకు నిర్వహించి ఆమోదించడం జరిగింది అన్నారు. ఈ రాజ్యాంగం భారత ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని కల్పిస్తుందని ప్రవేశికలో పొందుపరచడం జరిగింది, ఆ రకంగా రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ప్రజలకు చేరాలంటే ప్రజలందరూ రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు, ప్రధానంగా విద్య ద్వారా ప్రజలందరికీ మేమంతా సమానమే మాకు అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి అనేది అర్థం కావాలంటే విద్యావ్యవస్థలో ఉన్నటువంటి గ్రూపుల విధానాన్ని రద్దుచేసి ఒకే పేరుతో డిగ్రీని ఇస్తూ విద్యార్థులకు నచ్చిన సబ్జెక్టులను తీసుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
అంతేకాక పై గ్రూపులు తీసుకున్నవారు కింది గ్రూపులోకి రావడానికి అవకాశం ఇచ్చి కింది గ్రూపులు తీసుకున్నవారు పై గ్రూపులోకి వెళ్లకుండా నిషేధిస్తున్న ప్రస్తుత విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చి విద్యార్థులు తమకు నచ్చిన ఏ సబ్జెక్టు నైనా తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు, అలాగే ఆ సబ్జెక్టు చదివిన తర్వాత తమకు భవిష్యత్తు లేకుంటే మళ్ళీ వేరే సబ్జెక్టులు తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు మాత్రమే దేశంలో ఉన్న నిరుద్యోగం దరిద్రం ఆర్థిక అసమానతలు మొదలైనవన్నీ రూపుమాపబడతాయన్నారు, ఈ సమావేశంలో లెక్చరర్స్ మదవిలత, సునీల్, నిర్మల, అరుణ, శ్రీనివాస్, విక్రమాదిత్య, సాయివంశి పాల్గొన్నారు. అంతకు ముందు భారత రాజ్యాంగ సూత్రాలను పాటిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.