24-01-2026 09:46:44 PM
బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు
‘FIR @ Door Step’ అమలు చేసిన చివ్వెంల పోలీసులు
చివ్వెంల: రోడ్డు ప్రమాద ఘటనపై చివ్వెంల పోలీసులు వేగంగా స్పందించి, బాధితులకు తక్షణ సహాయం అందించారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, అక్కడి నుంచే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితులకు అందించడం ప్రశంసనీయమని స్థానికులు అభినందిస్తున్నారు. చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న వెంటనే చివ్వెంల పోలీసులు వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను తక్షణమే అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలోనే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితులకు అందించినట్లు చివ్వెంల ఎస్సై మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘FIR @ Door Step’ సేవలను అమలు చేస్తున్నామని, ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.