24-01-2026 10:04:40 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సనత్ నగర్ లోని దాసారం బస్తీ గుడిసె వాసులకు ఉపశమనం లభించింది. గత 25 సంవత్సరాలకు పైగా 300 కుటుంబాలు దాసారం బస్తీలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరంతా వాహనాలలో చెత్తను సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. కాగా కొందరు ప్రయివేట్ వ్యక్తులు వారిని బలవంతంగా ఖాళీ చేయించి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పోలీసుల సహకారంతో భయబ్రాంతులకు గురి చేసి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.
దీంతో ఆందోళనకు గురైన బాధితులు స్థానిక నాయకుల సహకారంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గోడును విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీలో పర్యటించి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎవరికి భయపడొద్దని భరోసా ఇచ్చారు. కాగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సీనియర్ న్యాయవాదులు భరద్వాజ్, PD. వెనీల ల ద్వారా గుడిసె వాసుల తరపున కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ ను పొందారు.
శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, న్యాయవాదులు కలిసి స్టే ఆర్డర్ ను అందజేశారు. స్టే ఆర్డర్ ఖాఫీని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసారం బస్తీ గుడిసె వాసులకు అందజేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మీరంతా కలిసి ఉండాలని అన్నారు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో త్రాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇక నుండి ఎవరైనా నేరుగా గుడిసె వాసుల వద్దకు వెళ్ళి ఖాళీ చేయమనే అధికారం లేదు కోర్టు పరంగానే ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ లో పేర్కొన్నట్లు వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గుడిసె వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టుకు సమర్పించాల్సిన వివరాలను గుడిసె వాసుల నుండి సేకరించడంలో బి ఆర్ ఎస్ నాయకులు గౌతమ్ శేషుకుమారి, న్యాయవాదులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో గుడిసె వాసులు తిమ్మప్ప, సురేష్, తిరుమలయ్య, సూరి, రవి తదితరులు ఉన్నారు.