calender_icon.png 22 May, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలం నేతల కామెంట్లు.. బీఆర్‌ఎస్‌లో కలకలం!

22-05-2025 12:31:18 AM

  1. గులాబీ పార్టీపై వరుసగా సంచలన వ్యాఖ్యలు
  2. పార్టీలో అసలేం జరుగుతోంది? అని క్యాడర్‌లో చర్చ
  3. బీఆర్‌ఎస్ గ్రాఫ్‌ను తగ్గిస్తే తమకు లబ్ధి చేకూరుతుందనే యోచనలో బీజేపీ నేతలు

హైదరాబాద్, మే21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో కీలక నేతల కామెంట్లు ఒక వైపు చర్చనీయాంశం అవుతుంటే మరోవైపు బీజేపీలో తెలంగాణ నేతలు వరసగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ నేతలు ఇటీవల కాలంలో గులాబీపార్టీని మాటలతో ఇరకాటంలోకి నెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ క్యా డర్‌లో అలజడి రేపింది. రేవంత్‌రెడ్డి స్థానం లో కేసీఆర్ సీఎం అవుతారని, కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కాబోతుందన్నారు.

జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత ఈ విలీనం పక్కా అంటూ మాట్లాడారు. దీనితో ఈ వ్యా ఖ్యలపై  బీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోం ది. నిజంగానే అటువంటి ప్రక్రియ ఏమైనా ఉందా అంటూ కొంతమంది నేతలు ఈ వ్యాఖ్యల మర్మంపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభాకర్ యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేశా రా లేక బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు ఇటువంటి కామెంట్లు చేస్తున్నారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

ఈ చర్చ ఇలా జరుగుతుండగానే బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై చేసిన కామెంట్లు ఆ పార్టీని మరింత కార్నర్ చేసే విధంగా ఉన్నాయి. ఆయన మీడియాతో చేసిన ఇష్టాగోష్టిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్‌ఎస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని, బీఆర్‌ఎస్ చీలిక దిశగా పయని స్తోందన్నారు. పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ రజతో త్సవ సభలో కేటీఆర్‌కే మొత్తం ప్రాధాన్యం ఇవ్వడంతో కవిత, హరీశ్‌రావు అసంతృప్తితో ఉన్నారని, విభేదాలు తారాస్థాయికి చేరాయని మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేతలు వరసగా చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే అటు బీఆర్‌ఎస్ క్యాడర్‌లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం కావాలనే బీజేపీ నేతలు సంచలన కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. బీఆర్‌ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ కామెంట్లు ఉన్నాయని అంటున్నారు. బీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గితే అది మరో ప్రతిపక్షపార్టీగా కాషాయం పార్టీకే కలిసి వస్తుందన్న విశ్లేషణ జరుగుతోంది.