పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించాలి

26-04-2024 01:48:01 AM

సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో కమిషనర్ రొనాల్డ్ రోస్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి విద్యలో రాణిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ గ్రౌండ్, చందానగర్ పీజేఆర్ గ్రౌండ్‌ల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు 44 క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. 6 మధ్య వయసు విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. మే 31 వరకూ కొనసాగే ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలకు ఆటల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. గతంలో వేసవి శిక్షణలో పొందినవారు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారని గుర్తుచేశారు. శిక్షణలో అందజేసే స్పోర్ట్స్ మెటీరి యల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.