‘కాళేశ్వరం’ కారకులందర్నీ విచారిస్తాం

26-04-2024 01:45:41 AM

n ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతివారినీ పిలుస్తాం!

n జస్టిస్  పీసీ ఘోష్ కమిషన్ ప్రకటన

n సమాచారం అందించాలని పబ్లిక్ నోటీసు జారీ

n రెండోరోజూ ఘోష్ కమిషన్ విచారణ

n త్వరలో కాళేశ్వరం సందర్శించే అవకాశం

n కమిషన్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ ఏకసభ్య కమిటీ విచారణలో వేగం పెరిగింది. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన కమిషన్ గురువారం రెండోరోజు కూడా విచారణను కొనసాగించింది. మధ్యాహ్నం జస్టిస్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ పిలిచి సమాచారం సేకరిస్తామని తెలిపారు. గురువారం పలువురు ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్‌ను కలిశారు. కమిషన్‌కు ఏయే రికార్డులు కావాలనేది జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు స్పష్టంగా సూచించారు.

మే మొదటి వారంలో రెండో విడత పర్యటన

శుక్రవారం కూడా కమిషన్ విచారణ జరుగనుంది. శనివారం జస్టిస్ ఘోష్ కొల్‌కతా వెళ్తారు. మే మొదటి వారంలో కమిషన్  రెండోసారి హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. రెండో విడత పర్యటన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలను సందర్శించే అవకాశం ఉంది. ఈ లోగా కావాల్సిన అన్ని రకాల రికార్డులను సేకరించడంపై కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే గురువారం నీటి పారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా, నోడల్ ఆఫీసర్‌గా నియమించిన ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు కమిషన్‌ను కలిశారు. వారి వారి పరిధిలో ఉన్న రికార్డులను దాఖలు పర్చాలని ఈ సందర్భంగా కమిషన్ వారికి స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

కమిషన్ సెక్రటరీ నియామకం

కమిషన్ విచారణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు వీలుగా కమిషన్‌కు సెక్రెటరీ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర హైకోర్టులో రిజిస్ట్రార్‌గా ఉన్న అధికారిని సెక్రటరీగా నియమించినట్టు సమాచారం. కమిషన్ పర్యటనలు, అధికారులకు సమాచారం ఇవ్వడం, రికార్డులు తెప్పించడం, అలాగే సీడబ్ల్యూసీ, కాగ్, ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ నివేదికలను తెప్పించుకునేందుకు వీలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు తదితర సమన్వయం చేసే వ్యవహారాలను ఈ సెక్రెటరీ చూడనున్నట్టు తెలుస్తుంది. 

బహిరంగ ప్రకటన

కాళేశ్వరంపై ఎలాంటి సమాచారం, ఎవరి వద్ద ఉన్నా.. కమిషన్‌కు అందించాలని బహిరంగ ప్రకటన (పబ్లిక్ నోటీస్)ను నీటి పారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా గురువారం జారీచేశారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అందులో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో  భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ పరమైన లోపాలు, నాణ్యతా లోపాలు, నిర్వహణ లోపాలు తదితర కారణాలను వెలికితీయడం, వాటికి బాధ్యులను గుర్తించడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్ల పైన పేర్కొన్న మూడు బ్యారేజీల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై కమిషన్ విచారణ చేపడుతుందని తెలిపారు. ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణపూర్వక అఫిడవిట్ల రూపంలో సీల్డు కవర్‌లో బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులోని కమిషన్ కార్యాలయంలో అందించాలని నోటీస్‌లో కోరారు. మే 31 వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బాక్స్‌లో ఫిర్యాదులు వేయవచవ్చని, లేదా పోస్టులో కూడా పంపించవచ్చని, తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా పొందిన ప్రమాణపత్రం లేని అఫిడవిట్లను తిరస్కరిస్తామని పేర్కొన్నారు.

కమిషన్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను గురువారం బీఆర్‌కే భవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వం విచారణకు తీసుకున్న చర్యలపై విన్నవించారు. తరువాత మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ మరమ్మతులకు ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై ఎన్‌డీఎస్‌ఏ చేసే సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలోనే ఎన్‌డీఎస్‌ఏ నుంచి మార్గదర్శకాలు వస్తాయని పేర్కొన్నారు.