30-08-2025 03:07:19 PM
గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడం మూలంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. దీంతో వైద్యం కొరకు గార్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం(Community Health Centre)కు శనివారం రోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జ్వరాలు, దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న ప్రజలు ఒకేసారి పెద్దఎత్తున కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంకు రావడంతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.
వృద్ధులు, గర్భిణీ స్త్రీలు చాలాసేపు లైన్లో నిలబడలేక నిరసానికి గురయ్యారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన సిహెచ్ సి ఆసుపత్రిలో ఒక్కరే డాక్టర్ వైద్య సేవలు అందించడం, మిగతా వైద్యాధికారులు లేకపోవడం, ఉన్న కొంతమంది వైద్యులు, సిబ్బంది సమయానికి ఆసుపత్రికి రాకపోవడం పట్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలను మెరుగుపరిచి, వైద్యులు స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించేలా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.