రూ.96 వేల కోట్ల 5జీ స్పెక్ట్రం కోసం పోటీ

08-05-2024 12:30:01 AM

వేలంలో పాల్గొంటున్న జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు

న్యూఢిల్లీ, మే 7: వివిధ సర్కిళ్లకు వచ్చే నెలలో టెలికాం శాఖ నిర్వహించనున్న 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడానికి మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలు జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు సిద్ధమవుతున్నాయి.ఈ వేలంలో పాల్గొనడానికి గడువు ముగిసేనాటికి ఈ మూడు ప్రైవేటు కంపెనీల నుంచి దరఖాస్తులు అందాయని టెలికాం శాఖ అధికారి ఒకరు తెలిపారు.  జూన్ 6 నుంచి ప్రారంభంకానున్న వేలంలో రూ.96,317 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్ చేయనున్నది. 2022లో గత వేలం జరిగినపుడు అదానీ గ్రూప్ సైతం బిడ్ చేసింది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రం వేలం మే 20 నుంచి ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తేదీని పొడిగించారు. 800 మెగాహెర్జ్, 900 మెగాహెర్జ్, 1800 మెగాహెర్జ్, 2100 మెగాహెర్జ్, 2300 మెగాహెర్జ్, 2500 మెగాహెర్జ్, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్స్ లో 5జీ స్పెక్ట్రం ఎయిర్‌వేవ్స్‌ను ఈ వేలంలో విక్రయిస్తారు.