పడిపోయిన గృహ పొదుపు

08-05-2024 12:26:29 AM

మూడేండ్లలో రూ.9 లక్షల కోట్ల తగ్గుదల

న్యూఢిల్లీ, మే 7: ఖర్చులకు తగ్గరీతిలో ఆదాయం పెరగకపోవడం, ద్రవ్యోల్బణం అధికం కావడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేయడం తదితర అంశాలతో దేశంలో కుటుంబాల పొదుపు భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2020 రూ.23.29 లక్షల కోట్లుగా ఉన్న గృహ పొదుపు 2021 సంవత్సరంలో రూ.17.12 లక్షల కోట్లకు, 2022 రూ. 14.16 లక్షల కోట్లకు వేగంగా తగ్గింది. కేవలం మూడేండ్లలో నికర గృహ పొదుపు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గింది. వాస్తవానికి అంతక్రితం నాలుగేండ్లలో ఈ పొదుపు పెరుగుతూ వచ్చింది. 2017 రూ.13.05 లక్షల కోట్లు ఉన్న పొదుపు 2018 రూ.14.92 లక్షల కోట్లకు, 2019 రూ.15.49 లక్షల కోట్లకు పెరిగింది. 

మూడింతలైన ఎంఎఫ్ పెట్టుబడులు

మూడేండ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో కుటుంబాలు చేసిన పెట్టుబడులు మూడింతలైనట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నా యి. 2020 రూ.64,084 కోట్లు ఉన్న ఈ ఎంఎఫ్ పెట్టుబడులు 2022 23కల్లా రూ.1.79 లక్షల కోట్లకు పెరిగాయి. షేర్లు, బాండ్లలో కుటుంబాల పెట్టుబడులు ఈ కాలంలో రెట్టింపై రూ.6.05 లక్షల కోట్ల నుంచి రూ.11.88 లక్షల కోట్లకు చేరాయి. అలాగే కుటుంబాలు తీసుకున్న రుణాలు నాలుగు రెట్లు పెరిగి రూ.93,723 కోట్ల నుంచి రూ.3.33 లక్షల కోట్లకు చేరాయి.