కిషన్‌రెడ్డిపై ప్రధానికి ఫిర్యాదు చేయండి
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిపై కౌంటర్
హైదరాబాద్, జూన్ 11: తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇదే అంశంపై ప్రధాని మోదీకి ఎందుకు ఫిర్యాదు చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించగా, దానిపై స్పందించిన రాజా సింగ్.. రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏమీ అనని సీఎం రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి వెళ్లగానే కిషన్‌రెడ్డిపై మండిపడతారని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు కదా, వెళ్లి ప్రధాని మోదీని కలవండి.. పని అయిపోతుందంటూ పేర్కొన్నారు. ‘బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కలిశారు. రేవంత్‌రెడ్డి అప్పుడు అడగొచ్చు కాదా’ అంటూ అని నిలదీశారు.
2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో లిస్ట్ కూడా తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రమిచ్చిన నిధులపై తాము అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రాలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడిందని విమర్శించారు. కనీసం మీరన్నా నిజం చెబుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చెవులు లేని వాళ్లను అడిగితే లాభం ఉండదని, చెవులు ఉన్నోళ్లను అడిగితేనే ప్రయోజనమని పేర్కొన్నారు. కాగా ఇటీవల కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌పై స్పందించడంతో ఆసక్తి నెలకొంది.






