7 August, 2026 | 3:30 AM

జగ్గయ్యపల్లి ఉపాధిహామీ ఆర్థిక అక్రమాలపై ఫిర్యాదులు

07-08-2026 02:18 AM
  1. జిల్లా అధికారులకు, కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు
  2. ఆగస్టు 19న గ్రామ పంచాయతీలో పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ

మానకొండూరు, జూలై 6 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్య పల్లి గ్రామపంచాయతీ పరిధిలో (2019) (2024) సంవత్సరాల మధ్య కాలంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులలో (విబిజీ రాంజీ)  జరిగిన ఆర్థిక, అక్రమాలు అవకతవకలపై,కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రజా ఫిర్యాదుదారుల విభాగంలో ఉపాధి హామీ పనులపై, విచారణ జరపాలని కోరుతూ గ్రామానికి చెందిన ఒకరు గత మే నెలలో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కార్యాలయం, కరీంనగర్ జిల్లా డీఆర్డీఏ అధికారుల ఆదేశాల మేరకు మానకొండూరు మండల స్థాయి అధికారులు, జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మే 26న విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో ఫిర్యాదుదారుడు ఈ ఆర్థిక, అక్రమాల, అవకతవకల పై తగిన ఆధారాలు సమర్పించిన ప్పటికీ, విచారణ జరిపిన అధికారులు, పై అధికారులకు సత్యదూరమైన నివేదికలను సమర్పించారు.

ఆ నివేదికల సమగ్ర వివరాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఫిర్యాదు దారునికి నివేదిక పంపించారు. కాగా కమిషనర్ ఇచ్చిన నివేదికలను చూసి ఖంగుతిన్న ఫిర్యాదుదారు, అందులో జరిగిన అవాస్తవాలను, ఏకపక్ష నిర్ణయాలపై, తిరిగి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఈ సంఘటనపై, బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

ఈ పూర్తి ఘటనపై తిరిగి విచారణ చేపట్టిన రాష్ట్ర కమిషనర్ కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఉపాధిహామి ( విబిజీ రాంజీ ) విభాగానికి సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి . ఆదేశాలలో భాగంగా ఆగస్టు 5న( బుధవారం) ప్రాథమిక విచారణ జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో జరిగిన ఈ విచారణలో మండల అధికారులు, ఫిర్యాదుదారు హాజరయ్యారు.

సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ విచారణలో పూర్తిస్థాయి ఆధారాలతో కూడిన వాదనలు వినిపించిన ఫిర్యాదుదారు ఎటువంటి దర్యాప్తు జరిగినా, క్షేత్రస్థాయిలో పరిశీలన, జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరగాలని నివేదించాగా అంగీకరించిన విచారణ అధికారులు ఆగస్టు 19 (బుధవారం) గ్రామపంచాయతీ కార్యాలయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు.

అందుకనుగుణంగా, (2019) ( 2024) మధ్యకాలంలో జగ్గయ్యపల్లి పంచాయతీ మరియు మండల పరిషత్ పరిధిలో ఉపాధిహామీ పనులకు పనిచేసిన ప్రతి అధికారి, ఉద్యోగి ఆ విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ సారి జరగబోయే విచారణ, జిల్లా అధికారులతో పాటు ప్రస్తుత, గతంలో పనిచేసిన మండల, గ్రామ స్థాయి అధికార గణం జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఆగస్టు 19న గ్రామస్థాయిలో జరిగే విచారణలో నిజా నిజాలు నిగ్గు తేలనున్నాయి. అవినీతి అక్రమాల గుట్టు బహిర్గతం కానుంది.