విరాళాల లెక్కింపు అక్రమాలపై సమగ్ర విచారణ
-టీటీడీ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తులను కలిచివేసింది
-దేవస్థానంపై విశ్వాసం దెబ్బతినే ప్రమాదం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వెలుగుచూసిన పరకామణి అక్రమాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరగా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. భక్తుల విరాళాలు లెక్కింపులో, నిర్వహణలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కోట్లాది భక్తులను తీవ్రంగా కలిచివేసిందని ఆయన తెలిపారు. దేవస్థానం పట్ల ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికత, భక్తి అన్నీ ఈ వ్యవహారంలో దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను చిన్నదిగా చూడడం తప్పు అని, ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే పెద్ద విషయమని పేర్కొన్నారు. పరకామణి వ్యవహారంపై ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కల్‌లో జరిగిన పౌర సమాజ స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత డబ్బు తిరిగిచ్చినా, ఆ నేరం రద్దవదని.. చట్టప్రకారం నేరం నేరంగానే మిగిలిపోతుందని చెప్పారు.
భవిష్యతు లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పరకామణి లెక్కల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, కౌంటింగ్ చేసే సిబ్బంది ఎంపిక నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ వరకు ఆధునిక టెక్నాలజీ వినియోగిం చాలన్నారు. ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి భక్తుల నమ్మకానికి సమాధానం ఇవ్వాలని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచినందుకు ఆయనను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పాల్గొన్నారు.
లెక్కల్లో టెక్నాలజీని వినియోగించాలి
భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చిన్న అక్రమాన్నీ సహించొద్దు. టీటీడీ లెక్కల వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, క్రమబద్ధమైన పర్యవేక్షణ అవసరం. “దేవుని ధనంపై నిర్లక్ష్యం కూడా ఒక నేరమే అవుతుంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్
భక్తుల దానంపై ఎవరికీ అధికారం లేదు
తిరుమల తిరుపతి దేవస్థానం ధనం, భక్తుల దానంపై ఎవరికీ వ్యక్తిగత అధికారం లేదు. “దైవ సంపదపై చేతులు వేసినవాడు నేరస్థుడు మాత్రమే కాదు, ధర్మ ద్రోహి. పరకామణి లెక్కలు భక్తుల కళ్లముందే లైవ్‌గా చూపించాలి.
చిలుకూరు రంగరాజన్ స్వామి
భక్తుల నమ్మకం సన్నగిల్లుతుంది
పరకామణి వంటి వ్యవహారాలను ‘సిస్టమ్ లోపాలు’గా కాకుండా ‘భక్తుల నమ్మ కానికి ద్రోహం’గా పరిగణించాలి. భక్తుల విరాళాల వినియోగంపై పబ్లిక్ డిస్‌క్లోజర్ సిస్టమ్ అమలు చేయాలి.
జేడీ లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ అధికారి
ధర్మంపై దాడి
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీక. పరకామణి వ్యవహారం నేరం మాత్రమే కాదని, అది ధర్మంపై దాడి. నిందితులపై కఠిన చర్యలు తీసుకో వాలి. విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగాలి.
జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి, మాజీ హైకోర్టు న్యాయమూర్తి






