25-09-2025 08:19:08 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యా శాఖలో మండల స్థాయి అధికారులు పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యా విభాగం సమగ్ర సమీక్ష వర్క్ షాప్ లో మండల విద్యాధికారులు, గిరిజన అభివృద్ధి అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ రీసోర్స్ పర్సన్, సిబ్బందికి శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ... పాఠశాల వారీగా మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేసి మండల విద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా ధ్రువీకరించి, సిఆర్పిలు సేకరించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మాట్ లో సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల ప్రొఫైల్, పూర్తి స్థితి, ఉపాధ్యాయుల ప్రొఫైల్, యుడైస్ లో ప్రధానోపాధ్యాయుల వివరాలు, పర్యవేక్షణ, తక్షణ సవరణలు, విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ స్థితి, ఆధార్ లేని విద్యార్థుల వివరాల ద్వారా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయడం, ఎంబియు, ఆధార్ ధృవీకృత విద్యార్థులకు అపార్ సంఖ్యల సృష్టి, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రిలీస్ రిక్వెస్టుల క్లియరెన్స్, డ్రాప్‌బాక్స్‌లో అప్‌లోడ్ చేయబడిన విద్యార్థుల నివేదికల సమీక్ష, పాఠశాల ఫెసిలిటీ & మెయింటెనెన్స్ గ్రాంట్ల ఖాతా వివరాల ధృవీకరణ, డిజిటల్ పరికరాల ప్రస్తుత స్థితి పర్యవేక్షణ ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. పాఠశాల సమాచారం పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.