30 June, 2026 | 7:20 AM

టిక్‌సైజ్ పైసాకు కుదింపు

28-05-2024 01:40 AM

ముంబై, మే 27: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్  తమ ట్రేడింగ్ నిబంధనల్లో  కీలక మార్పులు చేసింది. రూ.250 కన్నా తక్కువ దర పలికే స్టాక్స్ టిక్ సైజును ఒక పైసాకు కుదించింది. గతంలో ఇది 5 పైసలుగా ఉండేది. ఎన్‌ఎస్‌ఈ చేసిన మార్పు జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుం ది. టిక్ సైజ్ అంటే సెక్యూరిటీ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ ధరలో వచ్చే కనిష్ట మార్పు. స్టాక్ ధర మారే అతి తక్కువ మార్పును ఇది సూచిస్తుంది. దీన్ని స్టాక్ ఎక్సేంజ్  నిర్ణయిస్తుంది. 

ధరలో కచ్చితత్వం కోసం దీనిలో మార్పులు చేస్తారు. టిక్ సైజు ఎంత తక్కువగా ఉంటే ధరలో అంత కచ్చితత్వం ఉంటుంది. దీంతో ట్రేడర్లు మరింత తక్కువ ధరకు బిడ్లు దాఖలు చేయడం లేదా విక్రయించడానికి  అవకాశం ఉంటుంది. దీని వల్ల ట్రేడింగ్ చేసే వ్యయం కూడా మరింత తగ్గుతుంది.

ఈటీఎఫ్ మినహా.. 

టిక్ సైజులో మార్పులు ఈక్యూ, బీఈ, బీజెడ్, బీఓ, ఆర్‌ఎల్, ఏఎఫ్, సిరీస్ కింద నమోదైన ఈటీఎఫ్‌లు మినహా మిగిలిన అన్ని సెక్యూరిటీలకు వర్తిస్తాయి. క్యాపిటల్ మార్కెట్ విభాగంలోని స్టాక్ ధరకు  అనుగుణంగా ఫ్యూచర్స్ సెగ్మెంట్‌లో కూడా టిక్ సైజు మార్పులు చేస్తారు. అయితే నెలలో చివరి ట్రేడింగ్ రోజు నాటి ధర ఆధారంగా తర్వాతి నెల టిక్ సైజును నిర్ధారిస్తారు. అయితే ఆప్షన్స్ విభాగంలో మాత్రం టిక్ సైజు విషయంలో ఎలాంటి మార్పు ఉండదు.