22 June, 2026 | 2:21 AM

కామారెడ్డి కాంగ్రెస్‌లో కుదిరిన రాజీ

22-06-2026 01:00 AM
  1. గాంధీభవన్‌లో కుదిరిన సయోధ్య
  2. క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన షబ్బీర్ అలీ, గడ్డం ఇందుప్రియ 
  3. ఆడియో టేపులు తనవి కావన్న షబ్బీర్ అలీ 
  4. విమర్శలు వద్దు, కలిసి పనిచేయాలన్ని క్రమశిక్షణ కమిటీ 
  5. కలిసి పని చేస్తామన్న షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి 

కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి) : కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఎట్టకేలకు రాజీ కుదిరింది. గత కొన్ని రోజులుగా కామారెడ్డి నియోజ కవర్గంలో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయుల మధ్య వర్గ పోరుతో పాటు మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు, పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ మేరకు షబ్బీర్ అలీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కమిటీ ప్రతినిధులు ఆదివారం షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిలను గాంధీభవన్‌కు పిలిచి వివరాలు సేకరించారు. ఇటీవల విడుదలైన ఆడియో రికార్డులు తనవి కావని, కావాలనే కొందరు కుట్రపూరితంగా తప్పుడు ఆడియో సృష్టించారని షబ్బీర్ అలీ తెలిపారు.

సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం పార్టీ పరువును తీయవద్దని, కలిసి పని చేయాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇకనుంచి వర్గ పోరు పెట్టుకోకుండా కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని ఇరువురికి క్రమశిక్షణ కమిటీ పెద్దలు సూచించారు. గతంలో షబ్బీర్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని భవిష్యత్తులో జరిగే సమావేశంలో చర్చిస్తామని మల్లు రవి తెలిపారు. దీంతో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య క్రమశిక్షణ కమిటీ పెద్దల ఎదుట సయోధ్య కుదిరింది. ఇకనుంచి విభేదాలు విడి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని ఇరువురు తెలిపారు.