17 May, 2026 | 1:17 PM

‘ఆర్వీఎం’లో కొనసాగిన విద్యార్థుల ఆందోళన

20-06-2024 01:57 AM
  • కళాశాలను సందర్శించిన కేరళ ప్రభుత్వ ప్రతినిధి దేవరాజన్

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఈవో శ్రీనివాస్‌రెడ్డి

గజ్వేల్, జూన్ 19: సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం వైద్య కళాశాలలో విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. పారామెడికల్ కళాశాల విద్యార్థులు తమ సెల్‌ఫోన్లు తీసుకొని సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. దాదాపు 400 మంది విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించారు. ఇదిలా ఉండగా మంగళవారం వైద్య విద్యార్థులు (బీఎస్సీ నర్సింగ్) తమను సిబ్బంది, అధికారులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేయగా ఈ విషయం కేరళ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

కేరళ ప్రభుత్వ సంస్థ అయిన లోక కేరళ సభ సభ్యుడు కేవీ దేవరాజన్‌తో పాటు తెలంగాణ మళయాలీ ఫోరం అధ్యక్షుడు థామస్ జాన్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న 13 సమస్యలను సీఈవోకు విన్నవించగా వాటిని పరిష్కరిస్తామని సీఈవో శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరాజన్ మాట్లాడుతూ.. ఆర్వీఎం కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సుమారు 500 మంది విద్యన భ్యసిస్తున్నారని తెలిపారు. వారు ఇబ్బందులు పడుతున్నట్లు కేరళ ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు తాము కళాశాలను సందర్శించినట్లు తెలిపారు. కాగా, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు చెందిన ఆర్వీఎం వైద్య కళాశాలలో ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రజలు, దవాఖానకు వచ్చిన పేషెంట్లు చర్చించుకోవడం కనిపించింది.