31 August, 2026 | 3:01 AM

షరతులు వర్తిస్తాయి!

20-05-2024 01:56 AM

క్యాబినెట్ భేటీకి అంగీకరించిన ఈసీ

మంత్రిమండలి సమావేశం నేడు

ఇవీ షరతులు..

జూన్ 2లోపు చేపట్టాల్సిన పనులపై మాత్రమే చర్చించాలి.

రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చ వద్దు

ఎన్నికల్లో భాగస్వాములైన అధికారులనెవరినీ పిలువరాదు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం జరుగనున్నది. మధ్యాహ్నం ౩ గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావటంతో ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది.

జూన్ 2న నిర్వహించాల్సిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బరాజ్‌ల వద్ద గుత్తేదారు సంస్థ ఎల్ అండ్ టీ ఇప్పటికే తాత్కాలిక మరమ్మతు పనులు మొదలుపెట్టింది. రైతు రుణమాఫీ, పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని మొదట భావించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించటంతో ప్రభుత్వం ఎజెండాను మార్చింది. 

షరతులతో అనుమతి

క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల ౧౬వ తేదీనే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి కూడా కోరింది. కానీ, ఈసీ ఆ రోజు అనుమతి ఇవ్వలేదు. దీంతో సమావేశం వాయిదా పడింది. తాజాగా ఈసీ నుంచి షరతులతో కూడిన అనుమతి రావటంతో సోమవారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ఈసీ కొన్ని షరతులు విధించింది. హైదరాబాద్ పదేండ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగింపు, రైతు రుణమాఫీ లాంటి అంశాలను చర్చించవద్దని ఆదేశించింది.

అత్యవసర అంశాలు, తక్షణం చేపట్టాల్సిన చర్యలకు సంబం ధించిన అంశాలపైనే చర్చించాలని స్పష్టంచేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన పనులపై చర్చించవచ్చని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రభుత్వ అధికారులెవరినీ క్యాబినెట్ సమావేశానికి పిలువరాదని షరతు విధించింది.

క్యాబినెట్ సమావేశానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆరోజే అనుమతి వస్తుందని, వెంటనే సమావేశం నిర్వహించాలని సీఎం, ఇతర మంత్రులు రోజంతా ఎదురుచూసినా అనుమతి రాలేదు. దీంతో సమావేశాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. తాజాగా ఈసీ ఆదివారం అనుమతి ఇవ్వటంతో సోమవారం క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.