కోటా మాటేమిటి?
పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలపై మల్లగుల్లాలు
కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచాలని ఒత్తిడి
ఇప్పటికే ముగిసిన సర్పంచ్, మెంబర్ల పదవీకాలం
జూన్ ౩౦తో ముగియనున్న ఎంపీటీసీ, జడ్‌పీటీసీల గడువు
బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ
అందుకు కులగణన చేపట్టాల్సి ఉంటుందంటున్న నేతలు
ఈ ప్రక్రియకు రెండుమూడు నెలలు పట్టే అవకాశం
కొత్తవి తెస్తారా? ప్రస్తుత రిజర్వేషన్లే అమలు చేస్తారా?
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో.. రాజకీయ పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. జూన్ నెలాకరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందనే వార్తలు వెలువడుతుండటంతో.. పంచాయతీలో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటినుంచే క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి.
అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కులగణన చేసి.. జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు వాగ్దానం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెరుగుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
అయితే రిజర్వేషన్లు 50 శాతం దాట వద్దనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అధిగమించాల్సి ఉంటుంది. జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలంటే అసెంబ్లీ, పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారుల చేతుల్లో పల్లెలు
రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం జూన్ 3౦తో ముగుస్తుంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీకాలం జనవరి చివరినాటికే ముగిసింది. ఇప్పుడు గ్రామ పాలనను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన 224 గ్రామ పంచాయతీల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో రెండు పర్యాయాలు రిజర్వేషన్లు కొనసాగేలా సవరణ తీసుకొచ్చింది.
అంటే ప్రస్తుతం పూర్తయిన కాలంతోపాటు మరో ఐదేళ్లు ప్రస్తుత రిజర్వేషన్లనే అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలని భావించినా, ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పు చేయాలని నిర్ణయించినా అసెంబ్లీలో గత చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు నిర్వహిస్తుందా? రిజర్వేషన్లను పెంచి ఎన్నికలు నిర్వహిస్తుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
బీసీ రిజర్వేషన్లు కోసేసిన బీఆర్‌ఎస్
స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావా ల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలవుతుండగా, బీసీలకు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో 34 శాతం ఉంటే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 22.8 శాతానికి తగ్గించింది. దీంతో బీసీ వర్గాల నుంచి గత ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. జూన్ 4వ తేదీవరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే బీసీ కమిషన్ రెండు, మూడు నెలల్లో ఇంటింటి సర్వే నిర్వహించి నివేదికను సమర్పించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం దాన్ని ఆమోదించి రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. దాని ఆధారంగానే ఎన్నికలు జరిపే వీలుంటుంది.
భారీ ప్రక్రియ
రాష్ట్రంలో కొత్తవాటితో కలుపుకొని మొత్తం 12,814 గ్రామ పంచాయతీలు, 88,882 వార్డులు, 620 జిల్లా ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీ), 6,473 మండల ప్రాదేశిక (ఎంపీటీసీ) నియోజక వర్గాలున్నాయి. వీటి ఎన్నికల నిర్వహనకు భారీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తుండగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి నిర్వహించాలి.
ప్రాదేశిక ఎన్నికలను కూడా గడువులోగా నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే పంచాయతీల తరహాలోనే ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఏజెన్సీ (గిరిజన ప్రాంతాలు, తండాలు) ఏరియాల్లో పూర్తిగా ఎస్టీలు ఉండటంతో 1,177 సర్పంచ్ స్థానాలను వందకు వంద శాతం ఎస్టీలకు రిజర్వ్ చేయడ్డాయి. వీటితో పాటు నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు 688 పంచాయతీలు కేటాయించారు.
బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపించాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేసి.. రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపు శాస్త్రీయంగా ఉంటే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పదని, దీంతో శాశ్వత పరిష్కారకం లభిస్తుందని తెలిపారు. రిజర్వేషన్లు ఎందుకు పెంచాల్సి వచ్చిదనేది ప్రధా నమని, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రా ల్లో బీసీలకు జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొంత కాలం ఆలస్యమైనా ఫర్వాలేదని, రిజర్వేషన్లు పెంచాకనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి: ఆర్ కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కులగణన చేసి, దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచా ల్సి ఉంటుందని, ఇంకా కులగణన ప్రక్రియను ప్రారంభించలేదని, ఇది పూర్తి కావడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. స్థానిక సంస్థలకు తొందరపడాల్సిన అవసరం లేదని, జనాభా గణనతో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. బీసీ రిజ ర్వేషన్లను పెంచకుండా అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 50 శాతం పరిమితి అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదని, అగ్రకులాలకు కల్పించిన 10 రిజర్వేషన్లతో 50 శాతం పరిమితికి పార్ల మెంట్‌లో రాజ్యాంగ సవరణ జరిగిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల వివరాలు
క్యాటగిరీ మొత్తం మహిళలు పరుషులు
ఎస్టీ 688 344 344
ఎస్సీ 2,113 1,057 1,056
బీసీ 2,345 1,173 1,172
జనరల్ 5,147 2,574 2,573
మొత్తం 12,751 6,374 6,373






