calender_icon.png 14 May, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి

14-05-2025 12:43:39 PM

విద్యార్థి సంఘం నేత వాడపల్లి నవీన్ 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University)పై ప్రభుత్వం చూపుతున్న వివక్షను తక్షణమే నివారించాలని విద్యార్థి సంఘం నాయకుడు వాడపల్లి నవీన్ బుధవారం డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా న్యాయ (లా) కళాశాల మంజూరు చేయాలని గత రెండు సంవత్సరాలుగా వినతిపత్రాలు అందజేస్తూ, ఆందోళనలు చేస్తూ వస్తున్న విద్యార్థి సంఘాల కోరికలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఖండనీయమని అన్నారు. హైదరాబాద్‌ వరకు వెళ్లి న్యాయ విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో, జిల్లా మంత్రి చొరవ చూపి, విశ్వవిద్యాలయ పరిపాలన అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యార్థుల శ్రేయస్సు కోసం న్యాయ కోర్సు మంజూరు తక్షణమే జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలకు న్యాయ కళాశాలలు, బీటెక్ మరియు ఇతర కోర్సులను మంజూరు చేయడమే కాక, వాటికి బడ్జెట్‌ను కూడా విడుదల చేసిన తీరును ఉదహరిస్తూ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంపై సవతి తల్లి ప్రేమ చూపడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివక్ష కొనసాగితే, మరింత ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మిగిలిన మార్గమని స్పష్టం చేస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.