31-01-2026 09:15:26 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు వంతుల వారిగా డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఘట్ కేసర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పది, పది సంవత్సరాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి వంతెన నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. వంతెన నిర్మాణ విషయం కేవలం ఎన్నికల కోసమే వాడుకున్నారు తప్ప అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
అధికారం కోసం పార్టీలు మారుతూ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఆపార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, వారిలో సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అభివృద్ధి గురించి పట్టించుకునే స్థితిలో లేనట్టుగా ఉందన్నారు. ఆ రెండు పార్టీలు రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తూ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు.
రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఘట్ కేసర్ జేఏసీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే అభివృద్ధి డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే కర్రు కాల్చి వాతలు పెడతారన్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల నాయకులు ప్రెస్ మీట్ లకే పరిమితం కాకుండా దొంగ నాటకాలు వీడాలని, అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా జేఏసీ పనిచేసినట్లయితే బిజెపి నాయకులుగా తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు.
రైల్వే బ్రిడ్జి నిర్మాణం విషయంలో భారతీయ జనతా పార్టీ నిజాయితీగా పోరాటం చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. సమావేశంలో ఉపాధ్యక్షులు ములుగురం మహేందర్, యూత్ అధ్యక్షులు విక్రాంత్ రెడ్డి, గిరిజన మోర్చా కార్యదర్శి శోభన్ బాబు, నాయకులు పవన్, మణిదీప్, రేఖ, మమత శర్మ, పాల్గొన్నారు.