31-01-2026 09:30:42 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): తన కారును తగులబెట్టిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తుండటంపై శనివారం ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య మానవ హక్కుల కమిషన్ ను, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. పస్క నర్సయ్య తన కారును ఇంటివద్ద నిలిపి ఉంచగా గత ఏడాది డిసెంబర్ 13న అర్ధరాత్రి సుమారు 12 గంటల 30 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి పూర్తిగా తగులబెట్టారు.
ఈ ఘటనపై వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కమిషన్ కు తెలిపాడు. ఎఫ్.ఐ.ఆర్ నమోదై ఇన్ని రోజులవుతున్నా నిందితులను గుర్తించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. ఒక దళిత వ్యక్తిగా తన ఆస్తికి రక్షణ కల్పించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో స్థానిక యంత్రాంగం విఫలమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కారుకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పోలీసు విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేకూర్చాలని బాధితుడు పస్క నర్సయ్య మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.