6 May, 2026 | 1:54 AM

కేరళ సీఎం ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

06-05-2026 12:33 AM
  1. రేసులో కేసీ వేణుగోపాల్, సతీశన్
  2. హైకమాండ్ తుది నిర్ణయంపై ఉత్కంఠ
  3. ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన వేణుగోపాల్.. పార్టీ పెద్దలతో భేటీ

త్రివేండ్రం, మే ౫: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (డీఎఫ్) ఘనవిజయం సాధించిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వేణుగోపాల్ మొదటి నుంచీ అధిష్ఠానానికి అత్యంత నమ్మకస్తుడి, విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు.

63 ఏళ్ల వేణుగోపాల్ కన్నూరుకు చెందిన వారు. ఆయన కాంగ్రెస్‌లో విద్యార్థి సంఘం నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ కేరళ రాజకీయాల్లో ఆయన పేరు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేసులో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేరు కూడా వినిపిస్తున్నది. సతీశన్ నేతృత్వంలోనే యూడీఎఫ్ తన ప్రచారాన్ని ఉధృతంగా సాగించింది.

పరవూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఆరోసారి విజయం సాధించడం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో సతీశ న్ పాత్రే కీలకమని, కాబట్టి ఆయనకే సీఎం పదవి కట్టబెట్టాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ‘సీఎం లోడింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన మద్దతుదారులు సో షల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు, పార్టీ నుంచి మరో సీనియ ర్ నేత రమేష్ చెన్నితల పేరుగా కూడా సీఎం రేసులో ఉంది. ఇదే అంశంపై మీడియా మంగళవారం వేణుగోపాల్‌ను ప్రశ్నించగా, ముఖ్య మంత్రి అభ్యర్థి విషయంలో హైకమాండ్‌దే తు ది నిర్ణయమని కుండబద్దలు కొట్టారు. అనంతరం చర్చల కోసం ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. ఆయన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారని తెలిసింది. భేటీ తర్వాత సీఎం విషయం తెలుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.