ముషీరాబాద్‌లో అధ్వానంగా రోడ్లు
గుంతలమయంగా మారిన ప్రధాన మార్గాలు
పట్టించుకోని అధికారులు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటాం
ముషీరాబాద్ సర్కిల్ -40 డీఎంసీ ప్రవీణ్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 1౩ (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని అంతర్గత రోడ్లు కూడా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నియోజకవర్గంలోని ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్ పూర్ డివిజన్లోని ఆయా కాలనీలు బస్తీలలో రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికిని నియోజకవర్గంలో గుంతల మయమైన రోడ్లను మరమ్మతులు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు కనిపించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టి, గుంతలను వెంటనే పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదకరంగా మ్యాన్ హోల్స్
నియోజకవర్గంలోని పలు డివిజన్లు కాలనీలలో మ్యాన్ హోల్స్ కృంగిపోవడంతో పాటు శిధిలావస్థకు చేరుకున్నాయి. చిన్న వర్షం పడిందంటే చాలు మాన్ హోల్ సన్నీ ఓపెన్ అయి మురుగు నీరంతా రోడ్డుపై ఏరులై పారుతుండడంతో తీవ్ర దుర్గంధం వెదజల్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలు పడ్డాయి అంటే మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ అయి పలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి సందేహం లేదు.
ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను, శిధిలావస్థలో చేరుకున్న మ్యాన్ హోల్స్ మూతలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టడంతో పాటు, భవిష్యత్తులో రోడ్లు త్వరగా దెబ్బతినకుండా నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
రోడ్ల మరమ్మతులు చేపడతాం
ముషీరాబాద్ సర్కిల్ 40 పరిధిలోని ఆయా డివిజన్లలో, ప్రధాన రోడ్లలో ఏర్పడ్డ రోడ్ల గుంతలను గుర్తించి వాటిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని రోడ్లపై ఏర్పడిన గుంతలు, అద్వాన్న రోడ్లు, మ్యాన్ హోల్ లపై ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో మాట్లాడి వాటిని ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రవీణ్ కుమార్, (ముషీరాబాద్ సర్కిల్ 40 డీఎంసీ)






