24 July, 2026 | 3:26 AM

ప్రజారోగ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

24-07-2026 12:00 AM

మాజీ ప్రజారోగ్య సంచాలకులు, జనసేన రాష్ట్ర నేత డాక్టర్ గడల శ్రీనివాసరావు

ముషీరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని మాజీ ప్రజారోగ్య సంచాలకులు, జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు విమర్శించారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్-19 పూర్తిగా అంతరించిపోలేదని, ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు, డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కోవిడ్ పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్, ఫీవర్ సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను వెంటనే నివారించాలని కోరారు.

ప్రజారోగ్యంపై రాజకీయాలకు అతీతంగా నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నానని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రతిరోజూ అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసి పారదర్శకంగా సమాచారం అందించాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ప్రజారోగ్య సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.