13-01-2026 03:48:58 PM
ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మాజీ మంత్రి మల్లారెడ్డి.
జవహర్ నగర్,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ జవహర్ నగర్ పరిదిలో భారతీయ జనతా పార్టీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గబ్బిలాల పేట ప్రాంతాన్ని సందర్శించింది. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసేందుకు ఈ బస్తీ బాట పట్టిందని, ఈ ప్రాంత ప్రజలు డెంగు, మలేరియా, టైఫాయిడ్ వంటి అనేక రకాల జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై మురుగు నీరు నిలిచిపోవడంతో నడిచే పరిస్థితి కూడా లేకుండా మారింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలు జీవనం కొనసాగించాల్సి రావడం బాధాకరం.
ఎన్ని ప్రభుత్వాలు మారినా గబ్బిలాల పేట ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. గతంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు “జవహర్ నగర్ నా గుండెకాయ” అని చెప్పిన మాటలు ఫోటోలు, ప్రచారానికే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితి చూస్తే జవహర్ నగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర అధికారంలోకి రాగానే జవహర్ నగర్‌లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన హామీలు, ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చేసిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలుకాలేదు.
కాంగ్రెస్ నాయకుల మాటలు కోట్లలో ఉన్నప్పటికీ, గబ్బిలాల పేట ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తక్షణమే ఈ ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో OBC మోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ గారు రాష్ట్ర నాయకులు మైపాల్ రెడ్డి గారు బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి గారు ఉపాధ్యక్షులు రఘురాం చారి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చందు , సీనియర్ నాయకులు గిరి కత్తుల వెంకన్న మల్లికార్జున్ గౌడ్ శ్రీధర్ ఆంజనేయులు చారి రామకృష్ణ ,ప్రవీణ్ ,విష్ణు వర్ధన్ రెడ్డి మల్లేష్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.