calender_icon.png 7 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే!

07-10-2025 12:42:41 AM

-అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలి 

-మాజీ మంత్రి హరీశ్‌రావు 

-సంగారెడ్డి జిల్లా అందోల్‌లో అలయ్.. బలయ్

సంగారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె అంటున్నారని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అన్ని జడ్పీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారని, బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి మాట తప్పారన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారని, వారితో పాటు భట్టి విక్రమార్క బాండు పేపర్లు పంచారని గుర్తు చేశారు. నమ్మించి మోసం చేసి ప్రజల గుండెల మీద రేవంత్‌రెడ్డి తన్నాడని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను బట్ట బయలు చేసేందుకు ఇంటింటికి బాకీ కార్డులు పంచుతున్నామని వెల్లడించారు. బెల్ట్ షాపులు బందు చేస్తానని చెప్పి గల్లీకో బెల్టు షాపులు పెడుతున్నారని ఆరోపించారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. గవర్నర్ సంతకం పెట్టలేదని, రాష్ట్రపతి సంతకం కాలేదని కబుర్లు చెపుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో మార్కెటింగ్ మంత్రిగా ఉన్నపుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామని, హాస్పిటల్ కాంట్రాక్టుల్లో, ఇరిగేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చామని గుర్తు చేశారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర మీద పాదయాత్రకు శ్రీకారం చుడతామని చెప్పారు. కాంగ్రెస్ మెడలు వంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా బీజేపీ తెలంగాణను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. సబ్ కే సాత్ సబ్ కే వికాస్ అంతా బక్వాస్ అని విమర్శించారు.