calender_icon.png 9 January, 2026 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు నీటి పాఠాలు అవసరం లేదు

08-01-2026 03:46:44 PM

హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి చిన్నంబావి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్, వార్డు మెంబర్స్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో.. రాదో తెలియదు. నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ లో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారో అందరికీ తెలుసాని, అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడని, అవకాశవాదంతో కాంగ్రెస్ లోకి పోయిన నాయకుడు జూపల్లి కృష్ణారావు అని ఎద్దేవా చేశారు. మంత్రి అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచామని, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో.. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదని కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు.

ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ.. చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని, చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒకటే ఉంటుందని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను ముఖ్యమంత్రి తొక్కుతున్నాడని, కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పాలమూరును పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు.

తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రితోని మాకు నీటి పాఠాలు అవసరం లేదని, రేవంత్ రెడ్డికి బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని అని వ్యాఖ్యానించారు. నదుల గురించి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నీటి పాఠాలు చెప్తా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలని, రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారయిందన్నారు