05-07-2025 10:33:44 PM
గరిడేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణనాయక్..
హుజూర్ నగర్: గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమానికి పాల్పడి అరాచకం సృష్టించి అనధికారిక నూతన పాలకవర్గాన్ని నియమించుకున్నారని గరిడేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్(BRS Party President Gugulothu Krishna Nayak) విమర్శించారు. శనివారం ఆయన మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సర్వారం పిఎసీస్ చైర్మన్ గా అధికారికంగా వీరంరెడ్డి శంభిరెడ్డిని ఎన్నికయ్యారని, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు రెండుసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టి కూడా ఫలితం సాధించలేకపోయారని అన్నారు.
పూర్తిస్థాయి డైరెక్టర్లు లేకున్నప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టి అభాష్ పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. దీంతో అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు రాజీనామా చేశారని తెలిపారు. ఆ సమయంలో డిసిఒ పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే నీ పదవి ఉంటుందని లేకుంటే నిన్ను తొలగించడం జరుగుతుందని పాలకవర్గాన్ని బెదిరించటం అన్యాయం అన్నారు. ఒక అధికారి కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి.. రాజీనామా చేసిన డైరెక్టర్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో వారిని కార్యవర్గంలోకి తీసుకొని అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు జరిగిన అన్యాయానికి తప్పనిసరిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనధికారిక పాలకవర్గాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా సహకార సంఘం వద్దకు రాకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకొని అరెస్టు చేశారని ఆరోపించారు.
ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమై, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారన్నారు. ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక ఆదేశాలంటూ, ప్రత్యేక జీవోలు అని చెప్పి అనధికారిక పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సర్వారం సహకార సంఘం మాజీ చైర్మన్ వీరంరెడ్డి శంబిరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కడియం వెంకటరెడ్డి, గుత్తికొండ వెంకటరమణారెడ్డి, రామారావు, నట్టే సైదయ్య, కీత నాగరాజు, తెల్లబాటి నరేష్, మామిడి వెంకటేశ్వర్లు, సుక్క, సాయి, గుగులోతు వెంకటరామ్, గుగులోతు నరేందర్, షాంపు నాయక్, నాగరాజు, గుగులోతు హేమ్లా నాయక్, నట్టే రాజ్యం, నందిపాటి ముత్తమ్మ, కందుల గోవిందరెడ్డి పాల్గొన్నారు.