calender_icon.png 6 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీకి కష్టపడ్డ వారికే పదవులు

05-07-2025 10:22:59 PM

పైరవీలు చేస్తే పదవులు రావు..

కష్టం చేస్తేనే సర్పంచ్, ఎంపీటీసీ టిక్కెట్లు..

నాచారం ఆలయ అభివృద్ధికి నూతన ధర్మకర్తలు కృషి చేయాలి..

మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రయత్నిస్తాం..

నాచారం పాలకమండలి అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి...

గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికే పదవులు వస్తాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి(DCC President Thumkunta Narsa Reddy) అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల  అభినందన సభ ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన తూంకుంట నర్సారెడ్డి నాచారం ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తాను, డైరెక్టర్లను కండువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కట్టుబడి పని చేసిన వారి శ్రమను గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మంత్రులతో, గాంధీభవన్లో పైరవీలు చేస్తే పదవులు రావని హెచ్చరించారు.

పార్టీ కోసం కష్టపడ్డ వారికే  సర్పంచ్, ఎంపీటీసీ టికెట్లు దక్కుతాయన్నారు. నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామిని స్థానిక ప్రజలే కాకుండా జంట నగరాల ప్రజలు కూడా అత్యంత భక్తితో కొలుస్తారని, చుట్టుపక్కల జిల్లాల్లోనూ యాదగిరిగుట్టతో సమానంగా  నాచారం లక్ష్మీనరసింహస్వామి పేరు పొందాడని గుర్తు చేశారు. అలాంటి నాచారం గుట్ట పదేళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ నాచారం గుట్టను రూ. 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని మాస్టర్ ప్లాన్ వేయించి మర్చిపోయారన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి నాచారం ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలుకు కృషి చేస్తానని నర్సారెడ్డి వెల్లడించారు.

పదవులు వచ్చాయని గర్వం లేకుండా భక్తి భావంతో ప్రజలకు సేవలు అందించాలని, ఆలయ అభివృద్ధిలో పాలకమండలి సభ్యులు భాగస్వాములు కావాలని సూచించారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాచగిరి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది చూపిస్తామని ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో విజయ రామారావు, కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు నరేందర్ రెడ్డి, విజయ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్లు, నాయకులు కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.