calender_icon.png 6 July, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేహల్ మోదీ అరెస్ట్

05-07-2025 10:54:10 PM

అమెరికాలో అరెస్ట్ చేసిన పోలీసులు

నీరవ్ మోదీ సవతి సోదరుడే ఈ నేహల్ మోదీ

నేహల్ అప్పగింత ప్రక్రియపై జూలై 17న అమెరికా కోర్టులో విచారణ

నేహల్‌కు బెల్జియం పౌరసత్వం..

న్యూఢిల్లీ: తప్పుడు పత్రాలు సమర్పించి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ సవతి సోదరుడు నేహల్ మోదీ(Nehal Modi)ని అమెరికా అధికారులు జూలై 4న అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) చేసిన అభ్యర్థనల మేరకు ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల అభ్యర్థనతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్ తర్వాత నేహల్‌ను అదుపులోకి తీసుకుంది. నేహల్‌ను జూలై 4నే అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు భారత్‌కు సమాచారం అందించారు.

ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు రద్దయ్యేలా నేహల్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి సంవత్సరాల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, నేహల్ మోదీ, మెహుల్ చోక్సీ అరెస్ట్‌కు ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నాయి. విదేశాల్లో ఉంటున్న వీరిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని చూస్తున్నాయి.  అమెరికా ప్రాసిక్యూషన్ ఫిర్యాదుల ప్రకారం నేహల్ రెండు నేరాలను ఎదుర్కొంటున్నాడు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 3 కింద మనీలాండరింగ్ ఆరోపణలు, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాభియోగాలను ఎదుర్కొంటున్నాడు. 

బెల్జియం పౌరుడు నేహల్

తాజాగా అరెస్ట్ అయిన నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీకి బెల్జియం పౌరసత్వం ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ ఇప్పటికే బ్రిటన్ జైల్లో మగ్గుతున్నారు. మరో నిందితుడు మెహుల్ చోక్సీ అంటిగ్వా బందిఖానాలో ఉన్నాడు. ఇప్పుడిక నేహల్ మోదీ కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసులో మరింత వేగం పెరగనుంది. నేహల్ అప్పగింతపై జూలై 17న అమెరికా కోర్టులో విచారణ జరగనుంది. అమెరికా న్యాయస్థానం నేహల్‌ను భారత్‌కు అప్పగిస్తుందో లేదో? ఆ రోజే స్పష్టం కానుంది.

నేహల్ బెయిల్ పిటిషన్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అమెరికన్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నీరవ్ మోదీ ప్రధాన సూత్రదారుడిగా ఉన్న పీఎన్‌బీ కుంభకోణంలో నేహల్ పాత్ర కూడా చాలా కీలకం. దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నాయి. నీరవ్ మోదీ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో నేహల్ పాత్ర కీలకం. సుమారు 50 మిలియన్ డాలర్లను రెండు కంపెనీల ద్వారా అందుకుని వాటిని మనీలాండరింగ్‌కు ఉపయోగించినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. కుంభకోణం చేసిన అనంతరం డిజిటల్ సాక్ష్యాలను నేహల్ ధ్వసం చేశాడనే ఆరోపణలున్నాయి.