03-12-2025 12:55:31 AM
-స్థానిక ఎన్నికల కోసం వస్తున్న ఆ పార్టీ నేతలను నిలదీయాలి
-బిల్లులు అడిగినందుకు సర్పంచులను జైలులో వేసిన సర్కార్
-మాజీ మంత్రి హరీశ్‌రావు
-బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ నేతలు, మాజీ సర్పంచ్‌లు
గజ్వేల్, డిసెంబర్ 2(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
పెండింగ్ బిల్లులు అడిగినందుకు సర్పంచులను జైలు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌దేనని మండిపడ్డారు. గజ్వే ల్ మండలం దిమ్మనగూడ వద్ద ఓ ప్రైవేట్ హోటల్‌లో గజ్వేల్ జగదేవపూర్, కుకునూరుపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అవ్వ, తాతలకు నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి మొండిచేయి చూపారన్నారు. యాసంగి రైతుబంధు పడలేదని, రూ.2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందన్నారు.
ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని, రెండేళ్లయినా ఒక్కరికైనా తులం బంగారం దేవుడెరుగు, ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఇవ్వలేదన్నారు. బిల్లు లు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పాలు చేసిం దన్నారు.
పారిశుధ్య లోపం వల్లే గజ్వేల్ ప్రాంతంలో చాలామంది డెంగ్యూ వంటి విషజ్వరాలతో చనిపోయారని హరీశ్‌రావు ఆరోపించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.