50 శాతం పరిమితిని ఎత్తేస్తాం

07-05-2024 12:14:28 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం

అవసరాన్ని బట్టి ఆయా వర్గాలకు రిజర్వేషన్లు

రాజ్యాంగాన్ని రద్దుచేయాలని బీజేపీ కుట్ర

ప్రధాని మోదీ సర్వాధికారాలు కోరుతున్నారు

బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు ఖాయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ 


రత్లామ్ (మధ్యప్రదేశ్), మే 6: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అవసరం మేరకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో సోమవారం ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ దీనిని (రాజ్యాంగ ప్రతిని చూపుతూ) నాశనం చేయాలని చూస్తున్నారు. మార్చాలని చూస్తున్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించాలని కష్టపడుతున్నాయి మీకు జల్, జంగిల్, జమీన్‌పై హక్కులు కల్పించింది ఈ రాజ్యాంగమే.

అలాంటి రాజ్యాంగాన్ని నరేంద్రమోదీ రద్దుచేయాలని ప్రయత్నిస్తున్నారు. సర్వాధికారాలు తనకే కావాలని కోరుకొంటున్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అందుకే వాళ్లు 400 సీట్ల నినాదం అందుకొన్నారు. కానీ 400 కాదుకదా.. వాళ్లకు 150 సీట్లు కూడా రావు. రిజర్వేషన్లను రద్దుచేస్తామని వాళ్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా. మేం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం. పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలకు అవసరమైన మేరకు రిజర్వేషన్లు పెంచుతాం’ అని ప్రకటించారు. 

ఆదివాసీలపై మీడియా చిన్నచూపు

ఆదివాసీలపై జరుగుతున్న దారుణాలను మీడియా ప్రపంచానికి చూపకుండా దాస్తున్నదని ఆరోపించారు. ‘మీ పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. మీ భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. వీటిని మీడియా చూపించటంలేదు. అందుకు ఓ కారణం ఉన్నది. ఈ మీడియా కంపెనీల్లో ఆదివాసీలు ఎవరూ లేరు. అందుకే మీడియాకు అవి ప్రధాన వార్తలు కావటం లేదు’ అని విమర్శించారు. 

దేశంపై బ్యూరోక్రాట్ల పట్టు

దేశాన్ని 90 మంది బ్యూరోక్రాట్లు నియంత్రిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘కేంద్రప్రభుత్వాన్ని 90 మంది బ్యూరోక్రాట్లు నడుపుతున్నారు. వాళ్లే బడ్జెట్ విడుదల చేస్తారు. ఆ 90 మందిలో ఉన్న ఆదివాసీ ఒకేఒక్కరు. ముగ్గురు ఓబీసీలు, ముగ్గురు దళితులు. మీ జాతివాళ్లు (ఆదివాసీలు) మీడియాలో లేరు. కార్పొరేట్ ప్రపంచంలో లేరు. ఈ పరిస్థితిని మార్చాలని మేం నిర్ణయించాం. అందులో భాగంగానే కుల గణన, ఆర్థిక సర్వే చేపట్టాలని నిర్ణయించాం’ అని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.