calender_icon.png 28 June, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో ఎన్‌కౌంటర్

08-06-2025 12:56:39 AM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

  1. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు
  2. నేషనల్ పార్క్‌లో కొనసాగుతున్న కూంబింగ్ 
  3. అగ్రనేత హిడ్మా కోసం వేట 
  4. పాముకాటు, తేనెటీగల దాడిలో పలువురు జవాన్లకు అస్వస్థత

చర్ల, జూన్ 7 (విజయక్రాంతి)/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మూడో రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా మరో ముగ్గురు పురుషులున్నట్టు తేలింది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు.

మూడు రోజు ల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఏడుగురు మావోయి స్టులు మరణిం చారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మధ్యలో పాముకాటు, తేనెటీగల దాడితో కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యా రు. డీహైడ్రేషన్‌తో మరికొందరు స్పృహ తప్పడంతో సాయుధ దళాలు వారిని మెడికల్ క్యాంప్ నకు తరలించాయి.

గత కొన్ని రోజులుగా నేషనల్ పార్క్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సెర్చ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు సుధాకర్, మైలారపు ఆడేల్లు హతమయ్యారు. సుధాకర్‌పై రూ. కోటి, భాస్కర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని భద్రతా బలగాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

‘ఆపరేషన్ హిడ్మా’నే లక్ష్యంగా 

భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా లక్ష్యంగానే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అ బూజ్‌మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అణువణువూ జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నా యి.

కొద్దిరోజుల క్రితమే మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా.. తాజాగా నేషనల్ పార్క్‌లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో అగ్ర కమాండర్లు వరుసగా హతమవుతున్నారు. 80 కిలోమీటర్ల మేర విస్త రించిన ఉన్న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని మా వోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు.

ఈ విస్తీర్ణంలో ఒక్క పోలీస్‌స్టేషన్.. క్యాంప్ గానీ లేకపోవడంతో మావోయిస్టులు దానిని అవకాశంగా తీసుకుని స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా దళాలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా దొరికితే మాత్రం కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు ముగింపు పడినట్టే.

హిడ్మా తాజా ఫొటో వెలుగులోకి..

మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా తాజా ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా ఎలా ఉంటాడన్నది బయటి ప్రపంచానికి తెలియదు. దాదాపు పాతికేళ్ల క్రితం నాటి ఫోటోనే అందుబాటులో ఉంది. ఈ తరుణం లో మడావి హిడ్మా కొత్త ఫోటో బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మా రింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీతో, తెలుగుతోపాటు కోయ, బెంగాలీ, గోండు భాషల్లో మంచి పట్టు ఉంది. భారీ దాడులకు వ్యూహకర్తగా పేరు పొందిన హిడ్మా కేంద్ర బలగాల క్యాంపులపై మె రుపుదాడులు చేయడంతో నేర్పరి.

ప్రస్తుతం కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా మావోయిస్టు కమిటీలో అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. హిడ్మాకు మూడెంచెల భద్రతావ్యవస్థ ఉంటుంది. ఏ 10 నుంచి 12 మంది సభ్యులు, బీ 20 నుంచి 22 మంది, చివరి టీమ్ లో 15 మంది వరకు ఆయనకు రక్షణగా ఉంటారు. దళంలో ఇతరులకు వండే ఆహారాన్ని హిడ్మా తినడని, ఆయన కోసం ప్రత్యేక వంట తయారు చేస్తారని సమాచారం.

కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరునెలలకోసారి కనిపిస్తాడిన తెలిసింది. ప్రస్తుతం మడావి హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీకి కమాండర్‌గా ఉన్నాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజినల్ బ్యూరో ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది.