26 July, 2026 | 11:17 PM

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే కుట్ర

31-05-2024 12:03 AM

ఉద్యమంలో ఏనాడైనా సీఎం రేవంత్ పాల్గొన్నారా?

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధిని కాంగ్రెస్ చెరిపివేసేందుకు కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు. ఉద్యమంలో కాంగ్రెస్ ఎన్నడూ పాల్గొనలేదని, తెలంగాణ అస్థిత్వం, చరిత్రపై మరోసారి దాడి చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాట్లాడుతూ.. జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ నుంచి జరిగే కొవ్వుత్తుల ర్యాలీలో పాల్గొనాలని, కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తే ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు.

హత్యలు చేసిన వారే సంతాప సభలు పెట్టినట్లు కాంగ్రెస్ తీరు ఉందని, అమరవీరుల స్థూపం కాంగ్రెస్ దమనకాండను ప్రతిక్షణం గుర్తు చేస్తుందన్నారు. కొత్త చిహ్నాలతో తెలంగాణ చరిత్ర మాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అస్థిత్వంపై దెబ్బతీసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలపై పోరాటానికి విశాల వేదిక అవసరం ఉందన్నారు.

పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో వివాదాలు సృష్టిస్తున్నారని, చార్మినార్ మత చిహ్నం కాదని, కాకతీయ కళాతోరణం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా తెలియదని ఎద్దేవా చేశారు. అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహుల కుట్రలను అమలు చేస్తున్నారని, కోదండరాం లాంటి నేత  పక్కన ఉండి సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. చార్మినార్‌ను రాజముద్ర నుంచి తొలగించడంపై ఓవైసీ స్పందించాలని, ఉద్యమంలో పాల్గొనని రేవంత్‌రెడ్డికి చిహ్నాల గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.