బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం
మోదీ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు
టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగా నికి, దేశానికి ప్రమాదమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై బుధవారం కామారెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ చర్చకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లా డుతూ.. మతం పేరుతో భావోద్వేగాలను ప్రధాని మోదీ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అందరం ఐక్యంగా ఉండి, వారి మాటలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చినవారిని కేసుల నుంచి తప్పించారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షాలను అణిచి వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని, బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేశ్ షెట్కార్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధి సాధించాలంటే సురేశ్ షెట్కార్ గెలవాలని అన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించిందని తెలిపారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని, ప్రపంచదేశాలు ఓవైపు మాట్లాడుతుంటే.. కేంద్రంలోని బీజేపీ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా నిరంతరం దాడి చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎదురించిన వారి మీద కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాకతీయ యూనివర్సిటీలో కవులు, రచయితల మీద జరిగిన దాడి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడేనని స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అధికంగా పెంచడంతో సామాన్యుల మీద భారం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, దేశ సంపదలో 162 మంది బిలియనీర్లు, 25 శాతం ఉత్పత్తిని, 48 శాతం సంపద అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజలు 15 శాతం ఉత్పత్తిని, 6.4 శాతం సంపదను పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, టీపీజేఏసీ రైతు స్వరాజ్య నాయకులు కన్నెగంటి రవి, సురేష్ షెట్కార్ కూతురు గిరిజ షెట్కార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్, రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.




