1 గంట పోలింగ్ పొడిగింపు
ఎండల కారణంగా.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహణ
లోక్‌సభ బరిలో 525 మంది
ఓటర్లు 3.32 కోట్లు
సికింద్రాబాద్‌లో 45, ఆదిలాబాద్‌లో 12 మంది
15 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం వినియోగం
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడి
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీని ఒక గంటపాటు పొడిగించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. వాస్తవంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే, వేసవికాలం ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ తేదీని ఒక గంట పొడిగించాలని రాజకీయ పార్టీలు కోరటంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపామని, ఈసీ అందుకు అనుమతి ఇచ్చిందని వికాస్‌రాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ఎన్నికల భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లా డుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని చెప్పారు. ఎ
న్నికల విధుల్లో 2.94 లక్షల మంది పాలుపంచుకొంటారని వెల్లడించారు. ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు. ఈసారి 285 మంది స్వతంత్రలు పోటీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 7 చోట్ల 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు వాడాల్సి వస్తున్నదని తెలిపారు.
ఆదిలాబాద్ స్థానంలో ఒక ఈవీఎం సరిపోతుందని చెప్పారు. ఒక ఈవీఎంలో 15 మంది అభ్యర్థులతోపాటు నోటాకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. అదనపు ఈవీఎంల కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌లను జిల్లాల్లో ముద్రిస్తున్నామని, అన్ని చోట్ల ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పకే 47 శాతం వరకు స్లిప్పుల పంపిణీ జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను పెట్టుకోలేదని సీఈవో వివరించారు.
35,809 పోలింగ్ కేంద్రాలు
17 లోక్‌సభ స్థానాల్లో 1.5 లక్షల బ్యాలెట్ యూనిట్‌లు అవసరం ఉన్నదని, అదనంగా 35 వేలు అందుబాటులో ఉంచామని వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226, అత్యల్పంగా మహబూబాబాద్‌లో 1,689 పోలింగ్ కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 60 వేల మంది పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి మరో 20 వేల మంది అందుబాటులో ఉన్నారని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 18 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 16 వేల వరకు పరిష్కరించామని తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా 5 వేలకు పైగా ఈసీ అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇంటివద్ద ఓటు వేసేందుకు 10 వేలమందికి అవకాశం కల్పించామని, వారి వద్దకు ఈ నెల 5,6 తేదీల్లో తమ సిబ్బంది వెళ్తారని చెప్పారు.
మొత్తం ఓటర్లు 3.32 కోట్లు
రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని సీఈవో తెలిపారు. కొత్త ఓటర్లు 9.20 లక్షల మంది ఉన్నారని చెప్పారు. 529 మహిళా పోలింగ్ కేంద్రాలున్నాయని, 2.45 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇంటి ఓటింగ్ కోసం 24,974 మంది దరఖాస్తు చేసుకుంటే 10,364 మందికి, 11,032 మంది సీనియర్ సిటిజన్లకు అనుమతి ఇచ్చామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, కూలర్స్, ఫ్యాన్‌లు, కూర్చోవడానికి బెంచీలతో పాటు పారామెడికల్, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,185 కేసులు నమోదుచేశామని చెప్పారు. రూ.212 కోట్ల నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
వీటిలో నగదు రూ.81 కోట్లు, లిక్కర్ రూ.46 కోట్లు, రూ.26 కోట్ల డ్రగ్స్, రూ.27 కోట్లు వివిధ కేసులకు సంబంధించి డబ్బును సీజ్ చేసినట్లు చెప్పారు. ఫేక్ వీడియోలపై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలుంటాయని వివరించారు. కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారని, దానిని ఈసీఐకి పంపినట్లు తెలిపారు. ఎన్నికల ఖర్చు విషయంలో అభ్యర్థి పెట్టిన ఖర్చుకే లెక్క ఉంటుందని, రాజకీయ పార్టీల ఖర్చులకు పరిమితి ఉండదని పేర్కొన్నారు.




