calender_icon.png 26 July, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 2న ఢిల్లీలో జరగబోయే రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు భారీగా తరలివెళ్తాం: డాక్టర్ కోట నీలిమ

25-07-2025 11:57:12 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఆగస్టు 2న ఢిల్లీలో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు తెలంగాణ నుంచి భారీగా న్యాయవాదులతో తరలివెళ్తామని పీసీసీ ఉపాధ్యక్షురాలు, లీగల్ సెల్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. ఢిల్లీ సదస్సు నేపథ్యంలో పీసీసీ లీగల్ సెల్ ఛైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన లీగల్ సెల్ మీటింగ్ కు కోట నీలిమ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశమంతా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారన్నారు.

ఈ నేపథ్యంలో దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు, మహిళలతో  మమేకమయ్యారని తెలిపారు. రాజ్యాంగ పరంగా దక్కాల్సిన హక్కులపై ఆయా వర్గాల గొంతుకగా మారారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేశామని, కుల గణన నిర్వహించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సైతం ఆమోదం తెలిపిందన్నారు. ఇలా అన్ని వర్గాలకు సమ న్యాయం దక్కేలా రాజ్యాంగ స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతోందన్నారు.

మరోవైపు ఆగస్టు 2న రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ నుంచి భారీగా న్యాయవాదులతో తరలి వెళ్తామని చెప్పారు.  ఇందులో భాగంగా న్యాయ నిపుణులతో పలు అంశాలపై చర్చించామన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి లీగల్ అంశాన్ని రాహుల్ గాంధీ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన న్యాయవాదులు లేవనేత్తిన అంశాలపై వారితో చర్చించారు. అట్టడుగు వర్గాలు, మహిళల హక్కులపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భారీ ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.