calender_icon.png 27 July, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ఇమేజ్ పెంచేలా నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి

26-07-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 25 (విజయక్రాంతి): పోలీస్ ఇమేజ్ పెంచేలా పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో రోల్ కాల్ను పరిశీలించి, హాజరు, గైర్హాజరు సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు.

సిబ్బంది ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని,ఆధునిక సాంకేతికతను, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.  హిస్టరీ షీటర్స్, పాత నేరస్తులపై నిరంతర నిఘా, నైట్ బీట్, పెట్రోలింగ్ కార్యకలాపాలలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచాలని అన్నారు, నేరాల నివారణకు, చేధనకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సమీక్షలో బాన్సువాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి విట్టల్ రెడ్డి ,బాన్సువాడ టౌను, రూరల్, బిచ్కుంద ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఆస్తి నేరాలను నియంత్రణ చేయడంలో సవాళ్లను పరిశీలిస్తూ నేరాల నివారణ కోసం జిల్లా ఎస్పీ పలు సూచనలు, సలహాలు అందించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బాన్సువాడ ట్యాంక్బండ్ , బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజీర డ్యాం, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో  పెద్ద గుజ్జల్ తండా సర్వాపూర్ వాగులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పరిశీలించారు.

వాగులు, వంతెనలు దాటి ప్రయాణించరాదని, సెల్ఫీలు తీసుకోవడం చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఈ విషయం ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.  బాన్సువాడ డిఎస్పీ బి. విట్టల్ రెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ సిఐలు, ఎస్త్స్రలు  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .